దేశ మౌలిక విలువలు ధ్వంసం

దేశభక్తి, మతోన్మాదం కలగాపులగం

ప్రగతిశీల వాదులంతా విశాల వేదికపైకి రావాలి

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ పిలుపు

తణుకు, మార్చి 11: మత జాతీయవాదం మన దేశ మౌలిక విలువలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రగతిశీల, ఉదారవాద భావాలు ఉన్నవారంతా ఒక విశాల వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ కార్మికనేత, మార్క్సిస్టు మేధావి కలిదిండి భీమరాజు 85వ జయంతి సందర్భంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఏర్పాటు చేసిన స్మారకోపన్యాస కార్యక్రమంలో శ్రీనివాస్‌ ప్రధానవక్తగా పాల్గొన్నారు.విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ‘మతోన్మాద రాజకీయాలు-పర్యవసానాలు’ అనే అంశంపై కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ... దేశంలో ఒక పథకం ప్రకారం మత జాతీయవాదాన్ని వ్యాప్తిలోకి తెస్తున్నారన్నారు.సమస్యలన్నింటికీ ఫలానా మతం వారే కారకులంటూ, వారిపై విద్వేషాన్ని పురిగొల్పుతూ మొత్తం సమాజాన్ని వారికి వ్యతిరేకంగా తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. మత జాతీయవాదం దేశంలో ఒక నాజీ సిద్ధాంత ఆవిర్భావానికి కృషి చేస్తోందన్నారు. దీనివల్ల దేశంలో మైనార్టీ మతస్తులకేగాక మెజారిటీ మతంలోని అత్యధిక సంఖ్యాక ప్రజానీకానికి కూడా తీవ్ర హాని జరుగుతుందని ఆయన చెప్పారు. మత జాతీయవాదులకు దైవభక్తిగానీ, మత విలువల పట్ల గౌరవంగానీ ఉండదని, దానిని ఉపయోగించుకుని కేవలం కొందరి చేతుల్లో ఆధిపత్యాన్ని కేంద్రీకరింపజేసుకునే ప్రయత్నమేనన్నారు.

భారతీయ సమాజంలో ఉన్న ప్రత్యామ్నాయ ప్రగతిశీల అజెండాను పక్కదారి పట్టించడంలో జాతీయ సమైక్యత, సమగ్రత వంటి నినాదాలు బాగా పనికి వచ్చాయన్నారు. దేశభక్తి, మతోన్మాదం కలగాపులగమై పోయాయన్నారు. దేశంలో సైనికారాధన, యుద్ధారాధన పెరగడం ప్రమాదకరమని శ్రీనివాస్‌ హెచ్చరించారు. సైనికుల త్యాగాలు నిస్సందేహంగా ప్రశంసించవలసినవే కానీ, యుద్ధం చెయ్యాలో వద్దో రాజకీయ నేతలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూసి భయాందోళనలు చెందాల్సిన పనిలేదన్నారు. దళిత శక్తులు, సామాజిక న్యాయశక్తులు, వామపక్ష, ప్రగతిశీలవాదులు ఒక వేదికపైకి వచ్చి ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.