రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కళలు, కళాకారులు సుభిక్షంగా ఉన్నప్పుడే సమా జం బాగుంటుందని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె. రోశయ్య అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నటరాజ్‌ అకాడమీ, తెలుగు వెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో కళాభిషేకం శీర్షికన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జంటనగరాల్లోని సాంస్కృతిక సంస్థల నిర్వాహకులను పురస్కారాలతో సత్కరించారు. వీరితో పాటు పలువురు నాట్య గురువులకు ఉత్తమ నాట్య గురువు పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త లయన్‌ విజయ్‌కుమార్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య పురస్కారగ్రహీతలను సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంస్కృతిక సేవ చేస్తున్న సంస్థల ప్రతినిధులను సత్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. నటరాజ్‌ అకాడమీ వ్యవస్థాపకుడు గిరి విభిన్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌, నాగబాల సురే్‌షకుమార్‌ పాల్గొని పురస్కారగ్రహీతలను అభినందించారు.