ఖైరతాబాద్‌,  ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు వారిలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పోల్చదగ్గ వ్యక్తి అడవి బాపిరాజు అని, ఆయన పేరిట తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కళాక్షేత్రం కూడా లేకపోవడం బాధాకరమని ప్రముఖ కవి, సంపాదకుడు, అనువాదకుడు ఉప్పలూరి ఆత్రేయ శర్మ అన్నారు. బుధవారం రంజని తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో శత జయంతి జరుపుకొంటున్న సాహితీవేత్తలపై జరుగుతున్న ప్రసంగాల పరంపర ‘రచనా స్రవంతి’ శీర్షికలో భాగంగా ‘సాహితీవేత్త అడవి బాపిరాజు సాహిత్యం-వ్యక్తిత్వం’పై ఏజీ ఆఫీ్‌సలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాపిరాజు గరళ కంఠుడని, వెలుగు-నీడల జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగిపోయిన మహా మనిషి అని పేర్కొన్నారు. బాపిరాజు... కూలీలపై, నేత కార్మికులపై రాసిన పాటల్లోని భావాలు తరువాత కాలంలో వచ్చిన కవితల్లో, చలనచిత్ర గేయాల్లో తొంగిచూశాయన్నారు. ఇందులో భాగంగా అడవి బాపిరాజు అసంపూర్ణంగా వదిలిన మధురవాణి నవలను పూర్తిచేసిన రచయిత్రి శ్యామల ఆ నవల విశేషాలను సభలో వివరించారు. బాపిరాజు రచించిన ‘శశికళ’ గేయ సంపుటికి చెందిన గీతాలను రంజని కోశాధికారి నంద్యాల మురళీకృష్ణ ఆలపించారు. కార్యక్రమంలో రంజని ఉపాధ్యక్షులు ముళ్లపూడి భాస్కర శర్మ, ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, టీఎల్‌ఎన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.