మానవత్వం, టెక్నాలజీతోనే ప్రగతి

సన్మాన్‌ కార్యక్రమంలో 
నాస్కామ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

హైదరాబాద్‌సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కళలకు, కళాకారులకు ఎలాంటి సరిహద్దులు ఉండవని, అవి విశ్వవ్యాప్తంగా అందరి మన్ననలను అందుకుంటాయని నాస్కామ్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన క్రాఫ్ట్‌ కౌనిల్‌ ఆఫ్‌ తెలంగాణ ‘సన్మాన్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతరించి పోతున్న కళలను సజీవంగా ఉంచుతున్న వారిని గుర్తించి ప్రోత్సహించడమే కాకుండా వారి ఉత్పత్తును విక్రయించేందుకు ప్రదర్శనలు నిర్వహించడం ఆనందకరమన్నారు. ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ రంగంలోకి వారి ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా ప్రపంచం మొత్తం అమ్ముకునే అవకాశాలున్నాయని తెలిపారు. మానవత్వం, టెక్నాలజీ రెండూ మానవ వికాసంలో చాలా ముఖ్యమైన అంశాలన్నారు. టెక్నాలజీ వినియోగం పెరగడంతో పాటు అంతరించి పోతున్న కళారూపాలు కళాకృతులను తయారు చేసే విధానాన్ని తిరిగి పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్వర్యంలో కళాకారులకే కాకుండా చేనేత పనివారికి కూడా రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి అవార్డులను అందిస్తున్నామని విజయలక్ష్మి ప్రభాకర్‌ తెలిపారు. కళలు, చేతివృత్తులు అంతరించి పోకుండా వారికి తగిన అవగాహన కల్పించి, వారి ఉత్పత్తులను మార్కెట్‌ చేసేందుకు పూర్తి సహకారాలను క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ అందిస్తుందని తెలిపారు.  

క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యులు ఉషారాయుడు మాట్లాడుతూ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ప్రారంభించే సమయంలో కేవలం ముగ్గురు మాత్రమే వెండి కళాఖండాలను సృష్టించే వారున్నారని, ప్రస్తుతం అందించిన ప్రోత్సాహం కారణంగా వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు వారు ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారని తెలిపారు. కేవలం కులవృత్తిలా కాకుండా మరెంతో మంది యువకులు ఇలాంటి కళలను నేర్చుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలనందించిన పలువురికి అవార్డులను అందించారు.

జీవన సాఫల్య పురస్కారం 

ఏటికొప్పాక ప్రాంతానికి చెందిన చింతలపాటి వెంకటపతిరాజు లక్కబొమ్మల తయారీదారులను ప్రోత్సహించి, కళ అంతరించి పోకుండా ప్రోత్సహించారు. ఆయనకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. 

కళాభివృద్ధివేత్త పురస్కారం 

దేశంలోని వివిధ ప్రాంతాల్లో 9 చోట్ల వివిధ కళాబృందాలతో ప్రదర్శనలు నిర్వహించి వరంగల్‌ దరీని నేర్పించి, తయారీదార్లతో ఉండి వారికి అవసరమైన నమూనాలు నేర్పించి మార్కెటింగ్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన సతీష్‌ నాగేంద్రపోల్‌దా్‌సకు నార్నె గ్రూప్‌ తరపున కళాభివృద్ధ్దివేత్త పురస్కారాన్ని నార్నె ప్రభాకర్‌ అందించారు.
కళారంగంలో నైపుణ్యానికి రాష్ట్ర స్థాయిలో దళవాయి చిన్న రమణకు సురేందర్‌రెడ్డి దంపతులు అవార్డును అందించారు. జాతీయ స్థాయిలో కేరళకు చెందిన రాజీవ్‌పులవార్‌కు జాస్తి కృష్ణ కుమార్‌ అవార్డ్‌ను అందించారు.
చేనేత రంగంలో నైపుణ్యానికి రాష్ట్ర స్థాయిలో శ్రీకాకుళానికి చెందిన మావూరి అలివేలుకు నేమ అప్మేందర్‌ అవార్డును అందించగా, జాతీయస్థాయిలో గాంధీగ్రామ్‌కు చెందిన వేలుమణికి కళాంజలి తరపున శైలజా కిరణ్‌ అందించారు. 
పాలిటెక్నిక్‌ చదువుతోపాటు వారసత్వంగా వస్తున్న కళల్లో ప్రావీణ్యం ప్రదర్శిస్తున్న మొగులోజు వేణుగోపాల్‌కు లతితా ప్రావీణ్య పురస్కారాన్ని సీతారెడ్డి అందించారు.