రవీంద్రభారతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): సమాజాన్ని చైతన్యపరిచే సాహిత్యం రావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో పాలపిట్ట బుక్స్‌, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్‌ బాలకృష్ణ రచించిన ‘కలల గూడు’ కవితా సంపుటి పుస్తకావిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, కవిని అభినందించారు. ‘కలల గూడు’ లాంటి కవితా సంపుటులు మరిన్ని రావాల్సిన అవసరముందన్నారు. కవిత్వం పది మందిని ఆలోచింపజేసేదిగా ఉండాలన్నారు. ఈ సభకు సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షత వహించగా సాహితీవేత్తలు సిద్ధార్థ, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.