ప్రముఖ చిత్రకారుడు కాళ్ల సత్యనారాయణ కన్నుమూత

ఖమ్మం అర్బన్‌, నవంబరు 24: ఆయన కుంచెకు ఎల్లలు లేవు. సామాన్యుడి బతుకు వెతలు.. ఆర్థిక, సామాజిక పరిస్థితులు.. దేశ, ప్రపంచ కాలమానాలను చిత్తరువుల రూపంలో ప్రస్పుటపరిచారు. ఒక్క బొమ్మలోనే కావ్యాన్ని తలపించేలా ఎన్నెన్నో భావనలు కూర్చేవారు. ఇప్పుడా కుంచె ఒరిగిపోయింది. చిత్రకళా రంగంలో తెలుగు రాష్ట్రాల్లోనే లబ్ధప్రతిష్ఠులుగా పేరొందిన కాళ్ల సత్యనారాయణ (71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గతనెల 30న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కోటమ్మ కొన్నాళ్ల క్రితమే కన్నుమూశారు. ముగ్గురు కుమారుల్లో ఇద్దరు చిత్రకారులే. ఖమ్మం నగర శివారులోని పాండురంగాపురంలోని తన నివాసంలో కాళ్ల ఒక్కరే సాదాసీదా జీవితం గడిపారు.

కాళ్ల స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. విజయవాడలో చదువుకునే రోజుల్లో సినీ దర్శకుడు ధవళ సత్యం, ప్రముఖ సంగీత దర్శకుడు రాఘవులు, ఖమ్మానికి చెందిన దివంగత వైద్యుడు డాక్టర్‌ హరీశ్‌తో కలిసి కాళ్ల ఒకే గదిలో ఉండేవారు. హరీశ్‌ ఖమ్మంలో ‘కౌముది సరిత’ అనే పత్రికను స్థాపించాలని భావించి.. ఆ బాధ్యతలు చూసుకునేందుకు ఖమ్మం రావాలని కాళ్లను ఆహ్వానించారు. సొంతూర్లో కళకు తగిన ప్రోత్సాహం లేకపోవడం, తండ్రి రిక్షా కార్మికుడిగా ఉండడంతో స్నేహితుడి కోరిక మేరకు ఖమ్మం వచ్చారు.
 
హరీశ్‌ అనివార్య కారణాల వల్ల పత్రిక స్థాపించలేదు. అయినా కాళ్ల ఖమ్మంలోనే ఉండిపోయారు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ‘గ్రాఫిక్స్‌ కళ’ పేరుతో గ్రాఫిక్స్‌ షాప్‌ను ప్రారంభించి జీవనోపాధి పొందారు. కాగా కాళ్ల అభిమానులు, కవులు, రచయితలు పెద్ద సంఖ్యలో ఇంటికి వచ్చి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌, చిత్రకారుడు మోషేదయాన్‌, కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్‌ సీతారాం, ప్రముఖ కథా రచయిత చావాశివకోటి, ప్రముఖ కవి ప్రసేన్‌ తదితరులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు.