రవీంద్రభారతి/హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు జరిగిన అన్యాయాలను నిక్కచ్చిగా ఖండిస్తూ తన కలాన్నే లక్షమంది సైన్యంగా భావించిన మహాకవి కాళోజీ అని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభివర్ణించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాళోజీకి తగిన గౌరవం లభిస్తోందని, వరంగల్‌లో జరుగుతున్న కాళోజీ కళాక్షేత్రం పనులు వేగవంతం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోమవారం రవీంద్రభారతిలో కాళోజీ 105వ జయంతి వేడుకలు నిర్వహించి, కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌అలీ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష తదితరులు హాజరయ్యారు. కోట్ల వెంకటేశ్వర రెడ్డిని దుశ్శాలువా, మెమెంటో, రూ.లక్ష నగదుతో సత్కరించారు.