ప్రశ్నించే తత్వానికి ప్రతీక: సిరికొండ

అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

రవీంద్రభారతి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): మహాకవి కాళోజీ పేదప్రజల గొంతుక అని.. ప్రశ్నించే తత్వానికి ఆయన ప్రతీక అని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో కాళోజీ 104వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు ప్రదానం చేశారు. ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మధుసూదనాచారి ముఖ్య అతిథిగా విచ్చేసి పురస్కారగ్రహీతను సత్కరించి అభినందించారు.

మధుసూదనాచారి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజీలేని పోరాటంతో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన మహాకవి కాళోజీ అని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పక్షాన నిలిచిన మహాకవి కాళోజీ అని అన్నారు.మంత్రి నాయిని మాట్లాడుతూ కాళోజీ తెలంగాణకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నతుడని కాళోజీని కొనియాడారు. పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ మహాకవి కాళోజీ పేరిట నెలకొల్పిన పురస్కారాన్ని తనకు ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ప్రభాకరరావు, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.