హైదరాబాద్‌/ఖమ్మం అర్బన్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి రావులపాటి సీతారామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారాన్ని శనివారం ప్రదానం చేయనుంది. కాళోజీ 103వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీతారామ్‌ తెలుగు సాహిత్యంపై పీహెచ్‌డీ చేశారు. ‘1955నుంచి 90 వరకు ఆధునిక కవితా ధోరణులు’ అనే అంశంపై చేసిన పరిశోధనకు కాకతీయవర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. మహబూబాబాద్‌ డిగ్రీ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సీతారామ్‌.. సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. ఆయన సొంతంగా అఫ్సర్‌, ప్రసేన్‌ అనే సహకవులతో కలిసి రక్త స్పర్శ, 1990లో ఇదిగో ఇక్కడిదాకే, తర్వాత సన్నాఫ్‌ మాణిక్యం, అఫ్సర్‌, మరోసారి ప్రసేన్‌లతో కలిసి కవిత్వం, 2008లో కుప్పం కవితలు, 2008లోనే అదేపుట అనే సాహిత్య విమర్శ వ్యాసాలు, వరంగల్‌లో యాసిడ్‌ దాడికి గురైన యువతికి బాసటగా ఆ ముగ్గురు సరే... మనమాటేంటి, 2011లో కారేపల్లి కబుర్లు, 2014లో మానుకోట ముచ్చట్లు అనే సాహిత్య పుస్తకాలు వెలువరించారు. 2012లో స్మైల్‌ సాహిత్య పురస్కారం, మానేరు రచయితల సంఘం అవార్డు, కవి అజంతా అవార్డు అందుకున్నారు.