మేధావులు చర్చించకుండా ఇలా చేస్తారా?: కంచ ఐలయ్య

ఆర్యవైశ్యులు బెదిరించడం సరికాదు
ఇలాగే చేస్తే దుకాణాల్లో కొనుగోళ్లు చేయవద్దని పిలుపునిస్తాం: టీ-మాస్‌ ఫోరం

హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు’ అనే పుస్తకం సిద్ధాంతపరంగా రాసినదని కంచ ఐలయ్య అన్నారు. దానిపై చర్చలు జరపాల్సిన మేధావులు తన దిష్టిబొమ్మలు తగలబెట్టడం సరికాదన్నారు. కోమటోళ్లు అనడాన్ని అవమానకరమంటూ తెలంగాణ భాషను అవమానిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో తన దిష్టిబొమ్మలను తగలబెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
 

తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీ-మాస్‌ ఫోరం) ఐలయ్యకు మద్దతు పలికింది. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో.. ఫోరం నేతలు గద్దర్‌, తమ్మినేని వీరభధ్రం, కాకిమాధవరావులతో కలిసి ఐలయ్య విలేకరులతో మాట్లాడుతూ, ‘ఆర్యవైశ్యలు దిష్టిబొమ్మల్ని కాదు ప్రజాస్వామ్యాన్ని కాలుస్తున్నారు’ అని అన్నారు.

పార్టీలకు వాళ్లు విరాళాలిస్తారనే కారణంతోనే ప్రభుత్వం ఆర్యవైశ్యులపై చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఆర్యవైశ్యులు తమ పంథాను మార్చుకోకపోతే వాళ్ల దుకాణాల్లో కొనుగోళ్లు చేయవద్దని పిలుపునిస్తామని హెచ్చరించారు. గద్దర్‌ మాట్లాడుతూ... భావ ప్రకటన చేసిన ఐలయ్యను చంపుతామనడం సరికాదన్నారు. ఒక పథకం ప్రకారం నిరసనలు జరుగుతున్నాయన్నారు.
 
కాగా ఐలయ్యను బెదిరించడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ఉందని తమ్మినేని వీరభధ్రం ఆరోపించారు. కాగా ఐలయ్య పుస్తకం నచ్చని కొందరు వైశ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాహితి, ప్రగతిశీల రచయిత వేదిక, ఎరుక సాహితి సంస్థ ఒక ప్రకటనలో ఆరోపించాయి. కంచ ఐలయ్యపై బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
 
ఐలయ్యకు మద్దతుగా ఓయూ విద్యార్థుల ర్యాలీ..
కంచ ఐలయ్యను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత, మైనారిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయనకు బెదిరింపు కాల్స్‌ రావడాన్ని నిరసిస్తూ ఓయూలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి పోలీస్ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించి.. సీఐకి వినతిపత్రం సమర్పించారు.