ఆరా తీసిన సీఎం చంద్రబాబు..

ఫిర్యాదులోస్తే చర్య తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కంచ ఐలయ్య వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆర్యవైశ్యులను కించపరిచేలా ఐలయ్య రాసిన పుస్తకం ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆరా తీశారు. డీజీపీ సాంబశివరావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావులను పిలిపించుకొని మాట్లాడారు. వైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని పోలీస్‌ బాస్‌ను ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రి శిద్ధా రాఘవరావుతోపాటు పలు జిల్లాల్లో ఆర్యవైశ్యులు ఆ పుస్తకానికి వ్యతిరేకంగా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేశారని డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వివరించారు. రోజు రోజుకూ వైశ్యుల్లో ఆందోళన పెరుగుతోందని సీఎంకు చెప్పినట్లు తెలిసింది. దాంతో, సమాజంలో అశాంతిని రేకెత్తించే వాటిపై కఠినంగా ఉండాలని సీఎం నిర్దేశించినట్లు తెలిసింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.