అనారోగ్యంతో కన్నుమూసిన ‘కవి కేసరి’

70 పుస్తకాల రచన.. పలు అవార్డులు

నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌, సిటీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకులు.. కవి కేసరి బిరుదాంకితులు.. నడిచే విజ్ఞాన సర్వస్వం, సాహితీ భీష్ముడిగా పేరొందిన కపిలవాయి లింగమూర్తి (92) ఇకలేరు. కొన్నాళ్లుగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా దేవాలయాల చరిత్రపై చేసిన విస్తృత పరిశోధనలు కపిలవాయి లింగమూర్తికి తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపును తెచ్చిపెట్టాయి. లింగమూర్తి 14వ ఏటనే కావ్య రచనకు శ్రీకారం చుట్టారు. ఆయన స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలంలోని జీనుకుంట. స్వర్ణకారులు వెంకటాచలం, మాణిక్యమ్మ దంపతులకు 1928, జనవరి 31న జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ల వయసులోనే తండ్రి మృతిచెందడంతో మేనమామ పెద్ద లక్ష్మయ్య పర్యవేక్షణలో పెరిగారు. పద్దెనిమిదేళ్ల వయసులో నాగర్‌కర్నూల్‌కు చెందిన మీనాక్షమ్మతో వివాహం జరిగింది.

తెలకపల్లిలో పినతండ్రి పుల్లయ్య వద్ద రోజుకు రూపాయి కూలి చొప్పున ఐదేళ్లు పనిచేశారు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తిచేసినా.. ఆంధ్ర సారస్వత పరిషత్‌ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని పొందారు. ఉస్మానియా నుంచి సాహిత్యంలో మాస్టర్స్‌ పట్టాను, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీని పూర్తిచేశారు. 1970లో నాగర్‌కర్నూల్‌ జాతీయ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. 1972లో పాలెం, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా బాధ్యతలు చేపట్టారు. పాలెం ఓరియంటల్‌ కళాశాలలో బోధన చేసి 1983లో ఉద్యోగ విరమణ చేశారు. కథ, సాహిత్య విమర్శ, స్థల పురాణాలు, గ్రామాల చరిత్ర, దేవాలయాల చరిత్ర, పద్యకావ్యాలు, వ్యాఖ్యానాలు, శతకాలు, కీర్తనలు తదితర ప్రక్రియలతో లింగమూర్తి సాహితీ సృజన చేశారు. దాదాపు 70 పుస్తకాలు రాశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల నుంచి కపిలవాయి సాహిత్యంపై 6 సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి. కాగా అంత్యక్రియలను గురువారం ఉదయం 11 గంటలకు నాగర్‌కర్నూల్‌లో నిర్వహించనున్నారు.
 
పుస్తకాల్లో కొన్ని..
పండరినాథ విఠల శతకం, తిరుమలేశ శతకం, ఆర్య శతకం, ఛత్రపతి, దుర్గ, భర్గ శతకాలు, జినుకుంట రామబంటు శతకం, పరమహంస శతకం, పాలమూరు జిల్లా దేవాలయాల చరిత్ర, మామిళ్లపల్లి స్థల చరిత్ర, భైరవకోన క్షేత్ర మహత్యం, సోమేశ్వర మహత్యం, గద్వాల హనుమద్వచనాలు, సౌధశిఖరం, చక్రతీర్థ మహత్యం.
 
పురస్కారాలు.. బిరుదులు..
2014లో సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ నరసింహన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది విశిష్ట పురస్కారం; తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ (అందుకున్న తొలి వ్యక్తి); తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం; బ్రౌన్‌ సాహిత్య పురస్కారం, బూర్గుల ప్రతిభా పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం; బిరుదులు: కవితా కళానిధి, కవి కేసరి.
 
సీఎం కేసీఆర్‌ సంతాపం
లింగమూర్తి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సాహితీ రంగం ఓ విశిష్ట వ్యక్తిని కోల్పోయిందన్నారు. లింగమూర్తి మృతిపట్ల మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సిధారెడ్డి విచారం వ్యక్తం చేశారు.