అంబర్‌పేట, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): తన అనుభవాలను రచనలుగా మలచిన సాహితీకారుడు కొడవలి సత్యనారాయణ(అన్నా) అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. అంబర్‌పేట అన్నా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (కొడవలి సత్యనారాయణ) స్మారక పురస్కారాల ప్రదానం శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓరియంటల్‌ మ్యానుస్ర్కిప్ట్‌ లైబ్రరీలో జరిగింది. అతిథిగా హాజరైన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కొడవలి సత్యనారాయణ తన అనుభవాలను రచనలుగా చేసి నానీలను, రూబాయిలను రచించారని అన్నారు. ఆయన స్మారకార్థం అన్నా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కొడవలి రాజగోపాల్‌నాయుడు చేస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మసన చెన్నప్ప, విశ్వసాహితీ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జయరాములుకు పురస్కారాలను నందిని సిధారెడ్డి ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఓరియంటల్‌ మ్యానుస్ర్కిప్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్బారావు, రచయిత, అనువాదకుడు ఆడెపు లక్ష్మీపతి, తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్‌, అన్నా ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాజ్‌గోపాల్‌నాయుడు, సభ్యులు సాయి, శ్రీను, నాగేష్‌, మహే్‌షబాబు, నరేష్‌ పాల్గొన్నారు.