రవీంద్రభారతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహితీరంగంలో కొలకలూరి ఇనాక్‌ తనదైన ముద్ర వేశారని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ అన్నారు. మంగళవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మానస ఆర్ట్‌ థియేటర్స్‌, కవనవేదిక, శిఖరం ఆర్ట్‌ థియేటర్స్‌, జంటనగరాల సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా  ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోశయ్య ఇనాక్‌ను  అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య ఇనాక్‌కు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడమంటే తెలుగుకు, తెలుగు సాహిత్యానికి లభించినట్లన్నారు. తెలుగు ప్రజలంతా గర్వించదగిన వ్యక్తిత్వం కలిగిన మహోన్నతుడని ఇనాక్‌ను కొనియాడారు. ఈ సభకు తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత అధ్యక్షత వ్యవహరించారు. జూలూరు గౌరీశంకర్‌, కోయి కోటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.