శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌

సీతారామశాస్త్రికి ‘కొప్పరపు కళాపీఠం’ పురస్కారం

విశాఖ-కల్చరల్‌, సెప్టెంబరు 9: మన సంస్కృతిని, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారిలో రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఒకరని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. ఏ మాధ్యమంలోనైనా తన రచనలతో, పాటలతో లక్షలాది మందికి పరిచయం ఉన్న సాహితీ సంపద సిరివెన్నెల అని కొనియాడారు. కొప్పరపు కవుల కళాపీఠం, రాష్ట్ర సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నం కళాభారతిలో సిరివెన్నెల సీతారామశాస్త్రికి జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రముఖ కవి బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, పత్రికా సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సినీనటుడు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుసహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్‌కి అవధాన పురస్కారం ప్రదానం చేశారు.