విశాఖ-కల్చరల్‌, సెప్టెంబరు 9: కొప్పరపు కళాపీఠం సప్తదశ సంపూర్ణ వసంతోత్సవం సోమవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గాయని పి.సుశీలకు కొప్పరపు కవుల జాతీయ పురస్కారం, డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావుకు అవధాన పురస్కారాన్ని అందజేశారు. ముఖ్య అతిథిగా కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి మాట్లాడుతూ.. కొప్పరపు కవుల ప్రతి మాటలోనూ పద్యం ఉంటుందన్నారు. గంటకు మూడు వందల పద్యాలు చెప్పే సామర్థ్యం కొప్పరపు కవులకు ఉందని, వారి పేరిట కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మాచవరం వేంకట చెంచురామ మారుతీ సుబ్బరాయ శర్మ (మాశర్మ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ నేత పి.మురళీధరరావు, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు కె.రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.