చిక్కడపల్లి, జనవరి8(ఆంధ్రజ్యోతి): కళలకు మంచి రోజులు రానున్నాయని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి అన్నారు. ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సినారె సినీ సంగీత విభావరి సప్తాహం మంగళవారం త్యాగరాయగానసభలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ సినీ నటి  జమున సారథ్యంలో శివశంకరి గీతాంజలి సమర్పణలో  పద్మభూషణ్‌ డా. సి. నారాయణరెడ్డి 57 సంవత్సరాల సుదీర్ఘ సినీ గీత రచనా యాత్రలో 58 మంది సినీ సంగీత దర్శకుల స్వరకల్పనలో ఈ కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమంలో డా. నందిని సిధారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని సినీ గేయ రచయితలు కుమారి శ్రేష్ట, అభినయ శ్రీనివా్‌సలకు డా. సి. నారాయణరెడ్డి- వంశీ ఫిలిం అవార్డులను బహూకరించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాడమీలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. లలితకళలకు ఒక అకాడమీ, రవీంద్రభారతిలాంటి ఒక ఆడిటోరియం ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందన్నారు. కోట్లాది హృదయాలను దోచుకున్న మహాకవి సినారె అన్నారు. సినారె పాటలకు పులకించి, పరవశించి ఆయన్ని చూడటానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో చేరానన్నారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ కూడా వంశీ సంస్థ నిర్వాహకుడు డా. వంశీ రామరాజు నిర్వహించిన అనేక కార్యక్రమాలను ప్రేక్షకుడిగా కూర్చుని చూశారన్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆదరణ ఉన్న సంస్థ వంశీ సంస్థేనన్నారు. ఈ సందర్భంగా జరిగిన సినీ సంగీత విభావరిలో సినారె పాటలను స్వరపరచిన సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు, ఆర్‌ గోవర్దన్‌, సుదర్శనం, నాగరాజన్‌, సుసర్ల దక్షిణామూర్తి, విజయకృష్ణమూర్తి పాటలను గాయకులు చంద్రతేజ,, సురేఖామూర్తి, సుజారమణ, కల్లేపల్లి మోహన్‌, గీతాంజలి, అమీన్‌పాషా తదితరులు అద్భుతంగా గానం చేశారు. కార్యక్రమలో అమెరికాకు చెందిన డా.చందుపట్ల తిరుపతిరెడ్డి, వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి సురేఖామూర్తి  పాల్గొన్నారు.