తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి

రవీంద్రభారతి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): నాలుగు రోజుల పాటు పది నాటకాలతో నిర్వహించిన యువ నాటకోత్సవంతో కళాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపించిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అన్నారు. నవ శకానికి నాంది పలకడంతో భాగంగానే యువ నాటకోత్సవం రూపొందించబడిందని అన్నారు. తెలంగాణ రంగస్థల సమాఖ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యువ నాటకోత్సవం ఆదివారం ఘనంగా ముగిసింది. అతిథిగా విచ్చేసిన రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ నటీనటుల సత్తా చాటేందుకు యువ నాటకోత్సవాన్ని వినియోగించుకోవాలని అన్నారు. తెలంగాణ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఇలాంటి ఉత్సవాలతో నాటకం బతుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, నటుడు రవికుమార్‌, దర్శకుడు ఖాజాపాషాతోపాటు పలువురు రంగస్థల ప్రముఖులు పాల్గొన్నారు. చివరి రోజు ఖతర్నాక్‌ మల్లన్న, మేరే ప్యారే పతంగ్‌ నాటకాలను ప్రదర్శించారు. సురభి కళాకారులు ప్రదర్శించిన ఖతర్నాక్‌ మల్లన్న నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. మంచి మనిషి, చెడు మనిషికి తేడా చూపుతూ సాగిన ఈ నాటకం హాస్యానందాన్ని పంచింది.