న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మక జీవన సాఫల్య పురస్కారం లభించింది. ఆదివారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జాతీయ అవార్డుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో గుజ్జుల ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ అవార్డు గ్రహీతల సంక్షేమ సంఘం అధ్యక్షడు జావేద్‌ జమీన్‌ ఈ సందర్భంగా గుజ్జులను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి, పురస్కారాన్ని అందజేశారు. వరంగల్‌ జిల్లా శాయంపేట మండలం హుస్సేన్‌పల్లికి చెందిన రాజ్‌కుమార్‌కు ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 170 అవార్డులు లభించాయి. త్వరలో స్వీడన్‌లో ప్రపంచ శాంతి అవార్డును అందుకోనున్నారు. సెప్టెంబరు 7న దుబాయ్‌లో ఎక్స్‌లెన్సీ అవార్డును, అక్టోబరు 2న గాంధీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు.