తెలుగు సాహిత్యానికి కథానిలయం కొలమానం.. 

‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌

పాత శ్రీకాకుళం, ఫిబ్రవరి 9: ‘సాహిత్యంలో తెలుగుభాష ఔన్నత్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మనిషి మనుగడతో సాహితీ విలువలు ముడిపడి ఉన్నాయి. సాహిత్యంతోనే జీవితం పరిపూర్ణమవుతుంది’ అని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. శనివారం శ్రీకాకుళంలో నిర్వహించిన ‘కథానిలయం’ 22వ వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాహిత్య రచనలో పోటీతత్వం ఉండాలని, సాహితీ వేత్తలు సృజనాత్మకమైన రచనలు చేయాలని పిలుపునిచ్చారు. కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌, యూట్యూబ్‌ వినియోగంలో తప్పులేదని, వాటిని మంచికి ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని సూచించారు.
 
తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందించేలా రచయితలు కృషి చేయాలన్నారు. 50వేల కథలు నిక్షిప్తం చేసిన కథానిలయం తెలుగు సాహిత్యానికి కొలమానమని అభినందించారు. ‘కథ కోసం కాలినడక’ ప్రయాణం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషకు, పత్రికల మనుగడకు ఢోకా లేదన్నారు. కారా మాష్టారు మాట్లాడుతూ యువత, విద్యార్థులు సాహిత్యంపై అభిలాష పెంచుకోవాలన్నారు. ‘కథ కోసం కాలినడక’లో పాల్గొన్న రచయితలు, కవులను అభినందించారు. కార్యక్రమంలో కథ కోసం కాలినడక పాదచారులను సన్మానించారు. రచయిత్రి కాత్యాయని రచించిన ‘కథా మధనం’, మరో రచయిత దాసరి అమరేంద్ర రచించిన ‘కథా చిలుక చేతికి చిక్కలేదు’ పుస్తకాలను కాళీపట్నం రామారావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రచయిత అట్టాడ అప్పలనాయుడు అధ్యక్షత వహించారు