‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ శ్రీనివాస్‌

పాత శ్రీకాకుళం/ఎచ్చెర్ల, ఫిబ్రవరి 10: శాస్త్రం చేయని విశ్లేషణను సాహిత్యం చేస్తుందని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె.శ్రీనివాస్‌ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన కథానిలయం 22వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెద్దసంఖ్యలో కథలను నిక్షిప్తం చేసిన కథానిలయం తెలుగు ప్రాంతాల్లో సాహితీ కేంద్రంగా ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగు కథలు ఇక్కడ లభించడం అభినందనీయమన్నారు.

భావితరాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శాస్త్రం చేయని విశ్లేషణ కాల్పనిక సాహిత్యం చేస్తుందన్నారు. కథలో చరిత్ర, శాస్త్రీయ దృక్పథం ఉంటాయన్నారు. సాహిత్యంలో వస్తున్న మార్పులను గమనిస్తుండాలని సూచించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా కథ ఉండాలన్నారు. అంటరానితనం, దోపిడితనం కథలో ఉండకూడదని చెప్పారు. ప్రాచీన స్థాయి నుంచి ఆధునిక రచనల వరకు, ఆంధ్రా, తెలంగాణ రచనల్లో తేడా లేదని, భాష, భావజాలం వ్యక్తపరచడంలో మాత్రమే విభిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో కథానిలయం వ్యవస్థాపకులు కారా మాష్టారు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వివిన మూర్తి, దాసరి రామచంద్రరావు, కాళీపట్నం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.