గుండెపోటుతో కెనడాలో కన్నుమూత
రాష్ట్రంలో తొలితరం అగ్రశ్రేణి విమర్శకుడు

తార్నాక/ఆబిడ్స్‌/హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి, విమర్శకుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షుడు ఆచార్య మడుపు కులశేఖరరావు(88) కన్నుమూశారు. కెనడాలోని ఒంటారియోలో కొడుకు ప్రభాకర్‌రావు వద్ద కొంతకాలంగా ఉంటున్న కులశేఖరరావుకు ఆదివారం రాత్రి నిద్రలో గుండెనొప్పి వచ్చింది. అంబులెన్స్‌ వచ్చేలోపే అంతిమశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కులశేఖరరావు పూర్వ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నెక్కరి మేడిపల్లి గ్రామంలో 1932 జూన్‌ 25న జన్మించారు. ఆయన తెలంగాణలో తొలితరం సాహితీవేత్తగా, అగ్రశ్రేణి విమర్శకుడిగా గుర్తింపు పొందారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ (తెలుగు) చదివారు. ప్రముఖ రచయిత్రి పాకాల యశోదారెడ్డి, కథకుడు ఇరివెంటి కృష్ణమూర్తి ఆయన సహాధ్యాయులు. ఆంధ్రవచన వాఙ్మయ వికాసంపై పరిశోధన చేసినందుకు డాక్టరేట్‌ పొందారు. తెలుగు వచన సాహిత్యంపై ఈయన చేసిన పరిశోధన కొత్త పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచింది. ఉస్మానియా తెలుగు శాఖలో మూడున్నర దశాబ్దాలపాటు వివిధ విభాగాల్లో సేవలందించారు. 1992లో ఓయూలో పదవీ విరమణ చేశారు. తెలుగు,ఆంగ్ల భాషల్లో పలు రచనలు చేశారు. సింహగిరి వచనములు గ్రంథానికి పీఠికను రచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సాహిత్య అకాడమీ దానిని ప్రచురించింది. తెలుగు సాహిత్య చరిత్రను ‘ఏ హిస్టరీ ఆఫ్‌ తెలుగు లిటరేచర్‌’ పేరిట ఆంగ్లంలో విమర్శనాత్మక గ్రంథం రాశారు. కావ్యానుశీలనము, సింహగిరి వచనములు, ఆంధ్ర వచన వాఙ్మయం, చేమకూరి కవితావైభవం, తెలుగు వచన వికాసము వంటి విమర్శనాత్మక గ్రంథాలు ఆయన రచించారు. ‘సీతాసతి’, శ్రీకృష్ణ చరిత్ర, శ్రీనివాస సతి వంటి కవిత్వ సంపుటాలు తీసుకువచ్చారు. ఆయన ఇప్పటిదాకా తెలంగాణ సారస్వత పరిషత్‌ కార్యవర్గ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
 
విమర్శకుడిగా విశిష్ట కృషి: ఎల్లూరి
ఆచార్య కులశేఖరరావు మృతికి తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయన వచన వాఙ్మయ వికాసంపై చేసిన పరిశోధన ప్రామాణికమైందని, కవిగా విమర్శకుడిగా విశిష్ట కృషిచేశారని సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. ఓయూలోని మహాభారత సంశోధిత ప్రతిని తయారు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకున్న చిరస్మరణీయుడని తెలిపారు. మూడు తరాల భాషా, సాహిత్య విద్యార్థులకు కులశేఖరరావు గురువుగా వ్యవహరించారని పరిషత్‌ ప్రధానకార్యదర్శి జుర్రు చెన్నయ్య అన్నారు. ఓయూ తెలుగు శాఖ విభాగాధిపతి ఆచార్య సూర్యా ధనంజయ్‌, ఆచార్య వెల్దండ నిత్యానందరావు తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.