చిక్కడపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): సాహిత్యం ప్రజల పక్షాన ఉండాలని సుప్రసిద్ధ కవి కె శివారెడ్డి అన్నారు. విశ్వసాహితీ ఆధ్వర్యంలో ‘నేటి కవిత్వం - తీరుతెన్నులు - 2000- 2018 విప్లవ కవిత్వం’ అనే అంశంపై సదస్సు గురువారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ విప్లవ కవిత్వం ప్రజల పోరాటాలను ప్రతిబింబిస్తోందన్నారు. దోపిడీ, అసమానతలను విప్లవ కవిత్వం ప్రతిఘటిస్తుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  డా. కాశీం మాట్లాడుతూ ప్రజల పెనుగులాటలను, బాధలను సాహిత్యం ప్రతిఫలిస్తోందన్నారు. ప్రజా పోరాటాలకు సాహిత్యం పునాదిగా నిలుస్తోందన్నారు. అధ్యక్షత వహించిన విశ్వసాహితీ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త డా. బ్రాహ్మణపల్లి జయరాములు మాట్లాడుతూ సాహిత్యం ద్వారా సమాజ సమస్యలను తెలియజేస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చన్నారు. 

ఏ కవిత్వమైనా ప్రజల పక్షానే నిలుస్తుందని, అలా నిలిస్తేనే ఆ సాహిత్యానికి  విలువ మరింత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కె శివారెడ్డిని ఘనంగా సన్మానించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ఎమెస్కో సంపాదకులు చంద్రశేఖర్‌రెడ్డి, వైజ్‌మెన్‌ ఇంటర్నేషనల్‌ పూర్వ క్షేత్రాధికారి వైఎ్‌సఆర్‌ మూర్తి, విశ్వసాహితీ కార్యదర్శి గోళ్లమూడి పద్మావతి, సంయుక్త కార్యదర్శి తంగిరాలచక్రవర్తి, రావి దుర్గాప్రసన్న, ఆచార్య కడారి సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.