విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత మీగడ రామలింగస్వామికి శనివారం లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం ప్రదానం చేయనున్నట్టు ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఫౌండేషన్‌ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ స్థాపించి 14 ఏళ్లు పూర్తయిందని, ఏటా సాహిత్యం, కళా రంగాల్లో ఒకరికి ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, ప్రఖ్యాత హిందీ రచయిత హరివంశరాయ్‌ బచ్చన్‌ స్మృత్యర్థం 2005 నుంచి ఏటా ప్రముఖులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.

పౌరాణిక పద్యాలకు ఆదరణ తగ్గుతున్న దశలో మీగడ రామలింగస్వామి అనేక నాటకాలు రాసి సొంతంగా నాటక బృందం ఏర్పాటుచేసి ప్రదర్శనలు ఇచ్చారని పేర్కొన్నారు. పౌరాణిక నాటక రంగంలో 23 నంది అవార్డులు సొంతం చేసుకున్న ఆయన, పద్యనాటక రంగంలో వినూత్నంగా సంగీతనవావధానం ప్రక్రియ చేపట్టారని వెల్లడించారు. శనివారం సాయంత్రం కళాభారతిలో మీగడ రామలింగస్వామికి లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారం ప్రదానం చేస్తున్నామని తెలిపారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య తదితరులు కార్యక్రమానికి హాజరుకానున్నారు.