టీఎస్పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి):వ్వరం ఎక్కడ  ఉన్నా.. ఎక్కడకు మారినా.. గ్రామాల్లో ఒక రాజమల్లు (లాంగ్‌మార్చ్‌ నవలలోని పాత్రధారుడు) ఉంటాడని, ఆయన పోరాడి సాధించుకున్న తెలంగాణకు కాపలాదారుగా ఉంటాడని, ఇసుమంతా తేడా వచ్చినా మళ్లీ ఉద్యమం చేస్తాడని టీఎస్పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. దేశంలో స్వాతంత్రోద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమమే గొప్ప విజయం సాధించిందన్నారు. ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ రచించిన లాంగ్‌మార్చ్‌ నవల పరిచయసభను ఆదివారం తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల సబ్బండ వర్గాల ప్రజలపై ప్రభావం చూపిందన్నారు. ఆరో తరగతి విద్యార్థి నుంచి పింఛన్‌ తిరస్కరించిన వృద్ధుల వరకు ఉత్సాహంగా ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. లాంగ్‌మార్చ్‌ నవల ద్వారా చరిత్రను చదువుతుంటే చాలా ఉద్విగ్నంగా అనిపించిందని, ఇంతటి సజీవమైన ఉద్యమాన్ని మరిచిపోతున్నామా.. అనే బాధ కలిగిందన్నారు.  
 
ట్యాంక్‌బండ్‌పై పాపన్న, ఐలమ్మ విగ్రహాలుండాలి
ట్యాంక్‌బండ్‌పై సర్దార్‌ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ విగ్రహాలుండాలని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణవాళ్ల విగ్రహాలుండాలన్నదే తన కోరికని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంపై అనేక పుస్తకాలు వచ్చినాగానీ  కథలు, నవలలు రాలేదనే లోటును లాంగ్‌మార్చ్‌ నవల పూడ్చిందన్నారు. ఉద్యమంలో మిలియన్‌ మార్చ్‌ కీలకమైన మలుపని, ట్యాంక్‌బండ్‌పై జరిగిన మార్చ్‌కు ఈ నవల ప్రత్యక్ష, పరోక్షంగా సాక్ష్యమన్నారు.  చరిత్ర నిర్మాతలు ఒక్కరే ఉండరని, తెలంగాణ ఉద్యమ చరిత్ర వెనుక అమరుల త్యాగాలు ఇలా ఎన్నో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సాహిత్యమంతా పొలాలు, గ్రామాల్లో నుంచే వచ్చిందని, శిష్టులు, పండితుల నుంచి రాలేదని తెలిపారు.  తెలంగాణలో గొప్ప సాహిత్యకారులు, వైతాళికులున్నారన్నారు.
 
ప్రభుత్వ సలహాదారులు టంకశాల అశోక్‌ మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఉద్యమాలు, తిరుగుబాట్లు వచ్చినాగానీ దోపిడీకి వ్యతిరేకంగా సబ్బండవర్గాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమానికి వ్యవస్థీకృతమైన రూపాన్ని సర్దార్‌ సర్వాయి పాపన్న తీసుకొచ్చారని, మన రాజ్యం మనకు కావాలని నినదించారని తెలిపారు.   ప్రజల ఆకాంక్షలను ప్రతిబింభించిన సర్వాయి పాపన్నపై పరిశోధనలు జరగడం లేదని తెలిపారు. వందేళ్ల క్రితమే ముల్కీ రూల్స్‌కు  నిరసనగా సర్వాయి పాపన్న తిరుగుబాటు చేశారన్నారు.  సీఎం ఓఎ్‌సడీ దేశపతి శ్రీనివాస్‌, నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి లాంగ్‌మార్చ్‌ పుస్తకంలోని వివిధ అంశాలను, ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న నవలలు, కవిత్వాలు, పాటలు రాయడం ఊరికే సాధ్యమవ్వదని, ఉద్యమ నేపథ్యముండాలని అన్నారు.  నల్లమల్లలో యూరేనియం తవ్వకం వద్దంటూ పాట పాడారు. నల్లమల్ల అడవుల్లో యూరేనియం తవ్వకాలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ దిశలో ప్రభుత్వ సలహాదారులు, ఇతర ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోవాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రముఖ విమర్శకులు కెపి అశోక్‌కుమార్‌ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. నవల రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.దేవేంద్ర ప్రసంగించగా, ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్‌ లైవ్‌ పెయింటింగ్‌ వేశారు. 
 
ఉద్యమ నిర్మాణం మొదలైంది..: ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ 
తెలంగాణ ఉద్యమంలో కవిత్వం వచ్చినట్లుగా కథలు రాలేదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమం రాజకీయంగా ప్రారంభమవ్వకముందే అనేక రచనలు పెద్దింటి అశోక్‌ కుమార్‌ చేశారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కథ ఎట్లా ఉండాలని ఆ రోజుల్లో చర్చ ఉండేదని, కరువు, రైతుల ఆత్మహత్యల గురించి రాసినట్లుగా ఉద్యమ కథలు ఏవిధంగా రాయలన్న ప్రశ్న ఆనాడు వచన రచయితలను వేధించిందని తెలిపారు. తెలంగాణ కథలో తప్పనిసరిగా ప్రాంతీయ వివక్ష గురించి చెప్పనక్కరలేదని, సంక్షోభాన్ని చెబితే అదే తెలంగాణ ప్రాంతీయ వివక్షను చూపుతుందని గుర్తించిన రచయితల్లో అశోక్‌కుమార్‌ ఒకరన్నారు. వలసలు ఏవిధంగా ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయో వివరిస్తూ మొదలైన అశోక్‌కుమార్‌ కథల రచనలు అనతికాలంలో ఆయనను ఉన్నతస్థానానికి చేర్చాయని, అనాసక్తిగా అనిపించే కథలను ఆసక్తికరంగా రాసి తొందరగా ఉమ్మడి రాష్ట్రంలో కథకుడిగా ఎదిగారని చెప్పారు. లాంగ్‌మార్చ్‌ నవలలో ఎంచుకున్న పాత్రలోని రాజమల్లు అనే వ్యక్తి తెలంగాణ సగటు ఉద్యమకారుడు కాదని, నల్లికుంట్లలాంటోడని, అతడికి చేయాలని ఉన్నా.. నేరుగా చేసే ధైర్యం ఉండక రహస్యంగా చేసే విధానాన్ని రచయిత బాగా వివరించారన్నారు. ప్రయత్నం చేస్తూ పోవాలే.. నిరాశ చెందకూడదని నిరంతరం చెప్పే కనెక్షన్‌ ఉంటే ఆత్మహత్యలు జరిగేవి కావని, ఆ రాజకీయ నిర్మాణం జరగకపోవడమనేది ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజకీయ పార్టీ వైఫల్యమని ఆనాడు తాను వ్యాసాల్లో రాసినట్లు తెలిపారు.  గ్రామీణ ప్రాంతం నుంచి రాజకీయ నిర్మాణం జరగకపోవడం వల్ల రాష్ట్రం కోసం ఏదో చేయాలనే వ్యక్తిగత నిర్ణయాలతో ఆత్మహత్యలు జరిగాయని తెలిపారు. లాంగ్‌మార్చ్‌ నవలతో తెలంగాణ ఉద్యమ చర్రిత నిర్మాణం మొదలైందని, ఇదేవిధంగా కొనసాగిస్తే సంపూర్ణమైన రూపం వస్తుందని చెప్పారు. వివిధ రంగాలలో పనిచేసేవారిని ఉద్యమంలో ఎలాంటి భావోద్వేగం పలికించాయో, ఉద్యమం ఎలాంటి అవకాశం కల్పించిందో నవలల ద్వారే సాధ్యమవుతుందన్నారు.