కవాడిగూడ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రగతిశీల భావాలతో ప్రజల పక్షాన గళం వినిపించిన కమ్యూనిస్టు నాయకుడు  మగ్దూం మొహినుద్దీన్‌ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌పాషా అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి  మగ్దూం మొహినుద్దీన్‌ జయంతి సందర్భంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అజీజ్‌పాషా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు ఆనాడు  మగ్దూం మొహినుద్దీన్‌ పోరాటం చేశారని కొనియాడారు. నాటి ఉద్యమంలో ప్రాణాలు సహితం లెక్కచేయకుండా పాల్గొని నిజాం తాబేదార్లయిన దొరలు, భూస్వాములు, పటేల్‌, పట్వారీలను ఎదిరించి హైదరాబాద్‌ రాష్ట్రాన్ని నిజాం నుంచి విముక్తి కల్పించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. సమసమాజ స్థాపన కోసం క్రీయాశీలంగా రాజకీయాల్లో పాల్గొని కార్మిక, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి నర్సింహ,సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

గొప్ప పోరాట యోధుడు.. 

కవి రచయిత నటుడు మగ్దూం మొహినుద్దీన్‌ గొప్ప పోరాటయోధుడు అని మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం  త్యాగరాయగానసభలో గానసభ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త మగ్దూం మొహినుద్దీన్‌ జయంతి సభ గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా కవి, జర్నలిస్ట్‌ కనకాచారిని శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్రప్రసాద్‌ సన్మానించారు. నర్సింహారెడ్డి మాట్లాడుతూ  కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బిరుదు పొందిన మొహినుద్దీన్‌  పేదలపాలిట పెన్నిధి అన్నారు. కమ్యూనిజం అభిమానిగా తెలంగాణ విముక్తి పోరాటంలో కూడా పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో గాయకులు లలితరావు, టీవీ రావు  పాల్గొన్నారు.