రవీంద్రభారతి, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయులు బాపు-రమణలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ రమణాచారి అన్నారు. శనివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో బాపు-రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు-రమణల పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా  పురస్కారాలను ప్రముఖ కార్టూనిస్ట్‌ బీవీ సత్యమూర్తి , ప్రముఖు నటుడు, రచయిత తనికెళ్లభరణిలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి పురస్కారహీతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు-రమణల పుట్టినరోజంటే రచయితలు, కార్టూనిస్టులను ప్రత్యేకమైన రోజుగా భావిస్తారన్నారు. వీరి పేరున నెలకొల్పిన పురస్కారాలను గొప్పవారికి అందజేయడం అభినందనీయమన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ బాపు-రమణల పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సత్తిరాజు శంకర్‌ నారాయణ, రాళ్ళపల్లి నరసింహారావు, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, మేడపాటి రామలక్ష్మి, సతీష్‌ వేగేశ్న, కామరాజు నరేంద్ర, సంస్థ అధ్యక్షడు కళారత్న బ్నిం, వేగిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొని ప్రముఖ కార్టూనిస్ట్‌ సరసి రచించిన నవ్వేడేస్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు.