చిక్కడపల్లి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రాచీనకళ హరికథా కళారూపాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ బుద్ధా మురళి అన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే హరికథా ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. హరికథా కళాకారుడు సుధాకర్‌ ‘ఉత్తర గోగ్రహణం’ హరికథను వినిపించారు.

అతిథిగా పాల్గొన్న బుద్ధా మురళి మాట్లా డుతూ తెలంగాణ హరికథకులతో ప్రతినెలా చెప్పించడం అభినందనీయం అన్నారు. ఒకనాడు ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ కళారూపం నేడు కనుమరుగు కాకుండా గానసభ లాంటి వారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగిందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్‌ ఆచార్య టి.గౌరీశంకర్‌ మాట్లాడుతూ ఇటువంటి కళలను ఆదరించాలన్నారు. ప్రాచీన కళారూపం హరికథ అని, మన సంస్కృతిని సంప్రదాయాలను ఆధునిక తరానికి తెలియజేయడానికి ఈ హరికథ ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాకారుడు సుధాకర్‌ను సన్మానించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ఉపాధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్‌ పాల్గొన్నారు.