ఆమె ఆత్మకథ ‘నా గొంతే తుపాకి తూటా’ పుస్తకావిష్కరణలో వక్తల ప్రశంస..

పరిస్థితులకు తగ్గట్టు కమ్యూనిస్టులు పోరాడాలి: మల్లు స్వరాజ్యం
కొత్త పోరాటాలకు పాత విజయాలే స్ఫూర్తి
‘ఆంధ్రజ్యోతి’ సంపాదకులు కె. శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై7 (ఆంధ్రజ్యోతి): జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనుకంజ వేయని ధీరత్వం మల్లుస్వరాజ్యం సొంతం అని.. ఆమె గొప్ప యోధురాలు అని పలువురు సామాజికవేత్తలు,రచయిత్రులు, మహిళా సంఘాల ప్రతినిధులు కొనియాడారు. మల్లు స్వరాజ్యం ఆత్మకథ ‘నా గొంతే నా తుపాకి తూటా’ పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సామాజిక వేత్తలు, మహిళా సంఘాల నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, కవు లు, రచయితలు, ప్రజాతంత్ర ఉద్యమాలతో అనుబంధం ఉన్న కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఆమె రాజకీయ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. శాసనసభ్యురాలిగా స్వరాజ్యం అందించిన సేవలను గుర్తుచేశారు. ‘పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆనాడు తనలో ఏ నిప్పురవ్వ రాజుకుందో ఇవాళ 86ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగసిపడుతూ ఉంది.
 
ఈ రోజుకీ ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తున్నారు’ అని జాతీయ బాలల హక్కుల కమిషన్‌ పూర్వ అధ్యక్షురాలు శాంతాసిన్హా కొనియాడారు. స్వరాజ్యం లాం టి వ్యక్తులు శతాబ్దానికి ఏ ఒక్కరో ఉంటారని ప్రముఖ స్త్రీవాద ఉద్యమకారిణి వసంత కన్నబిరాన్‌ అన్నారు. ఫాసిస్టు ప్రమాదం వేగంగా ముంచుకొస్తున్న సమయం లో, తెలంగాణలోనూ కాషాయం కమ్ముకొస్తున్న వేళ.. పాత విజయాల్ని, పోరాటాల్ని గుర్తుచేసుకొని కొద్దిగా అయినా స్ఫూర్తిపొందేందుకు ఈ సభ ఒక సందర్భంగా నిలుస్తుందని ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు. పాత విజయాల్ని, పోరాటాలను గుర్తుచేసుకోవడం ద్వారా ఇప్పుడు చేయాల్సిన, చేయబో యే పోరాటాలకు స్ఫూర్తి అందుతుందని పేర్కొన్నారు.
 
వామపక్షాలను బతికించండి
మల్లు స్వరాజ్యం ఈ సభలో మాట్లాడేముందు..కె. శ్రీనివా్‌సను దగ్గరకు పిలిచి, ఆయన చేయి పట్టుకొని ఉపన్యాసం ప్రారంభించారు. ‘వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా ప్రోగ్రాం (పనివిధానం)ను మార్చుకోవాలి. సమసమాజాన్ని, ప్రజారాజ్యాన్ని సాధించాలనే ప్రతిజ్ఞను జనంలోకి తీసుకెళ్లి వామపక్షాలను బతి కించండి’ అని సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులు జైనిమల్లయ్య గుప్త, బూర్గుల నరసింగరావు, సుగుణమ్మ, మాజీ ఎమ్మెల్సీ సీహెచ్‌ సీతారాములు, సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి పాల్గొన్నారు.