ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌

యద్దనపూడి, ఫిబ్రవరి 18: సమాజంలోని చెడుని తరిమివేసే అయుధాలు కథలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. మనిషి పుట్టినప్పుడే కథలు పుట్టాయని ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం గన్నవరం హైస్కూల్‌లో రమ్యభారతి సాహిత్య త్రైమాసిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తెలుగు చిన్నకథల పోటీల విజేతలకు.. సోమేపల్లి సాహిత్య పురస్కార ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సమాజంలో చెడును తొలగించేందుకు వీరేశలింగం పంతు లు, గురజాడ అప్పారావు ఎంతగానో కృషి చేశారన్నారు. చిన్న కథల పోటీల వల్ల తెలుగుభాషలోని తియ్యదనం కనిపిస్తుందని వాటిని ప్రోత్సహించాలని కోరారు. విదేశీ సంస్కృతిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు.

తెలుగును కూచిపూడి నాట్యం కొంత వరకు కాపాడుతోందని, అమెరికాలో వేలమంది దీన్ని నేర్చుకుంటున్నారని చెప్పారు.తమిళనాడులో జల్లికట్టును నిషేధించినప్పుడు అక్కడ అందరూ ఐక్యం గా పోరాడితే అనుమతి లభించిందని.. ఆంధ్రజాతికి నష్టం జరిగితే ఐక్యంగా పోరాడేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం చిన్నకథల పోటీలలో ప్రథమస్థానం సాధించిన చీరాలకు చెందిన వడలి రాధాకృష్ణ, ద్వితీ స్థాన ంలో నిలిచిన అనకాపల్లికి చెందిన సాయిబాబా, తృతీయస్థానం సాధించిన ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావుకు బహుమతులు ప్రదానం చేసి సత్కరించారు.