రవీంద్రభారతి, మే 11 (ఆంధ్రజ్యోతి): పాలమూరు వర్సిటీ అధ్యాపకుడు డా. మంగళగిరి శ్రీనివాస్‌ రచించిన సంగడి పుస్తకావిష్కరణ శనివారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి సభాధ్యక్షత వహించగా రమణాచారి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ పేదరికం విద్య నేర్చుకోవడానికి, విజయం సాధించడానికి అడ్డం కాదని పట్టుదల ఉంటే చాలని అన్నారు. తెలుగు భాషను సుసంపన్నం చేయడానికి మంగళగిరి శ్రీనివాస్‌ చేసిన రచనలు దోహదం చేస్తాయన్నారు. ఈ పుస్తకాన్ని తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ దంపతులకు అంకితమిచ్చారు.  ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ పరిశోధన ద్వారా సేకరించిన విషయాలను గ్రంథంగా తీసుకురావాలన్న తపనతో పాటు శ్రమించే తత్వం మంగళగిరి శ్రీనివా్‌సలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా చైతన్య సమితి వ్యవస్థాపకుడు బడేసాబ్‌, రాజగోపాల్‌  పాల్గొన్నారు.