పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: సమాజంలో అత్యంత వినయంగా ఉండే ఒక సామాజిక వర్గాన్ని కించపరుస్తూ కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని ఏపీలో నిషేధించాలని మంత్రి మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. ఓ కులాన్ని కించపరిచే విధంగా పుస్తకంలో అసత్యాలను రాయడం సమంజసం కాదన్నారు. వైశ్యుల నిరసనను ప్రభుత్వం అడ్డుకోవాలని చూడడం మంచిపద్ధతి కాదన్నారు. ఐలయ్య మద్దతుదారులు ఈ నిరసనలపై మండిపడటం మరింత విడ్డూరంగా ఉందన్నారు. సమాజంలో ఏ కులాన్నయినా కించపరచడం తప్పని, అలా కించపరచడం సామాజిక న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇంతమంది మనోభావాలను కించపరిచిన ఆ పుస్తకాన్ని నిషేధించాలని కోరారు.

ఐలయ్య పుస్తకాన్ని నిషేధించాలి
కొనసాగిన ఆర్యవైశ్య ఆందోళనలు
ఐలయ్య క్షమాపణ చెప్పాలి: గణేశ్‌ గుప్తా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): వైశ్యుల మనోభావాలను కించపరిచేలా పుస్తకం రాసిన కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బుధవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రేటర్‌ ఆర్య వైశ్య యువజన సంఘాలు, ముషీరాబాద్‌ వైశ్యసమాఖ్య, చిక్కడపల్లి, గాంధీనగర్‌, రాంనగర్‌ ఆర్యవైశ్య సంఘాలు, ఆర్యవైశ్య హాస్టల్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఐలయ్యతోపాటు పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ కూడా క్షమాపణ చెప్పాలని నిజామాబాద్‌ అర్బన్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా డిమాండ్‌ చేశారు. కాగా ఐలయ్య డాక్టరేట్‌ను ప్రభుత్వం రద్దు చేయాలని సినీ నటి కవిత డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం, మంచిర్యాల జిల్లాలో ఆర్యవైశ్యులు ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.