రాంనగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : భారతీయ కళలు కూచిపూడి, భరతనాట్యం దేశ ఔనత్యాన్ని పెంపొందిస్తున్నాయని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నటరాజ నాట్యాలయ్‌ కూచిపూడి సంస్థ (మియాపూర్‌) ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముఠా గోపాల్‌  మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు కళలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కూచిపూడి, భరతనాట్యం కళాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ఎమ్మెల్యే గోపాల్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నర్సింహా, ఎం.ఎన్‌.రావు, వెంకటేశ్వరరావు, రాజ్‌వర్మ, శేఖర్‌, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్‌, జైసింహా, ముచ్చకూర్తి ప్రభాకర్‌ పాల్గొన్నారు.