చిక్కడపల్లి, సెప్టెంబర్‌5(ఆంధ్రజ్యోతి): అనుమాండ్ల భూమయ్య మధురంగానూ, అందంగానూ పద్యం రాయగల గొప్ప కవి అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా నందిని సిధారెడ్డి అన్నారు. కిన్నెర ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య రచించిన ‘నా అక్షరాకృతి’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని ఆవిష్కరించిన సిధారెడ్డి మాట్లాడుతూ భూమయ్యను వస్తునవ్యత ఉన్న కావ్యం రాసిన ఆధునిక కవిగా అభివర్ణించారు. ఏదిరాసినా నూతనంగా చెప్పడానికి భూమయ్య యత్నిస్తారన్నారు. సాహితీవేత్తలు ఓలేటి పార్వతీశం, పాలకుర్తి మధుసూదనరావు, కళాజనార్దనమూర్తి, అనుమాండ్ల భూమయ్య, సంగనభట్ల నరసయ్య, జ్యోత్స్నప్రభ, రఘురామ్‌ పాల్గొన్నారు.