రవీంద్రభారతి, మే 10 (ఆంధ్రజ్యోతి): దాశరథి రచించిన మోదుగుపూలు గ్రంథం తెలంగాణ స్వభావాన్ని చాటిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నవలా స్రవంతి-2 నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి రంగాచార్య రచించిన ‘మోదుగుపూలు’ నవలపై అంపశయ్య నవీన్‌ ప్రసంగించారు. నవలా స్రవంతిలో ఈ గ్రంథం ఓ మైలు రాయిగా నిలిచిందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ రచనలు చేసిన దాశరథి మోదుగుపూలు గ్రంథంతో సామాజిక నవలా రచన చేశారన్నారు. తెలంగాణ పదాలతో మోదుగుపూలు గ్రంథం ప్రతి ఒక్కరినీ కదిలించిందన్నారు. తెలంగాణ యాసను ప్రపంచీకరణ చేయడంలో ఈ గ్రంథం సింహభాగం వహించిందన్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని తన రచన ద్వారా దాశరథి చాటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి పాల్గొన్నారు.