రవీంద్రభారతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైతాళికుడు దాశరథి రచించిన మోదుగుపూలు నవల నాటకరూపం దాల్చింది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని కళ్లకు కడుతూ సాగిన మోదుగుపూలు నాటకం ప్రేక్షకులను రంజింపజేసింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్‌ అండ్‌ మీడియా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో మోదుగుపూలు నాటకాన్ని ప్రదర్శించారు. రమేష్‌ కిషన్‌ గౌడ్‌ దర్శకత్వం వహించిన ఈ నాటకంలో తెలంగాణ రైతాంగ పోరాటాన్ని చూపించారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాట సన్నివేశాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి హాజరై నటీనటులను సత్కరించి అభినందించారు.