‘నవలా నాయికలు’ వ్యాస సంకలనం పురుడుపోసుకున్న తీరు  గురించి తెలిస్తే, సామాజిక మాధ్యమాల పట్ల సదభిప్రాయం కలగాల్సిందే. ఫేస్‌బుక్‌ వేదికగా కలిసిన కొందరు  పాఠకులు, ఇప్పుడు నవలా సమీక్షకులుగా మారారు. ముఖ పుస్తక నేస్తాల అక్షర అడుగుల ప్రస్థానం మొదలైంది ఇలా..!
 

హైదరాబాద్‌ సిటీ, మార్చి11 (ఆంధ్రజ్యోతి): వివిధ రంగాలకు చెందిన వారందరినీ ఫేస్‌బుక్‌ కలిపింది. కాదు, వాళ్ల పుస్తకపఠనాసక్తే ఆ తొమ్మిదిమందినీ ఒక్కటి చేసింది. అందరూ పలు రకాల ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డవారే. విభిన్న నేపథ్యాలకు చెందిన వారందరి అభిరుచీ ఒక్కటే. అదే సామాజిక, రాజకీయ విశ్లేషణా నవలలు, కథా సాహిత్యం చదవడం. ఎవరికి వారుగా సాహిత్యాన్ని చదువుకోవడం ఒక ఎత్తు. అందులోని ఆసక్తికర అంశాలు, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం మరొకెత్తు. పుస్తకాల గురించి ఒకరికొకరు నిరంతరం మాట్లాడుకోవడం వల్ల మానసిక పరిణితి, ఆలోచనల విస్తృతి పెరుగుతాయని భావించారు ఆ పాఠకులు. అలా వారు చదివిన నవలలపై ముఖ పుస్తకం వేదికగా సమీక్షలు రాయడం ప్రారంభించారు. సాధారణ పాఠకులైన మహిళలు రాసిన సమీక్షలను చదివి ఆశ్చర్యపోయారు నవలా రచయిత్రి కేఎన్‌ మల్లీశ్వరి. సంబంధిత నవల తీరుతెన్నులు, దాని లోతుపాట్లని వారు విశ్లేషించిన తీరు ఆమె మదిలో కొత్త ఆలోచనను రేకెత్తించింది.  మల్లీశ్వరి ప్రోత్సాహమే ఆ  సామాన్య పాఠకులను సాహిత్య విమర్శకురాళ్లుగా అక్షర అడుగులు ప్రారంభించేందుకు ప్రేరణైంది. 

‘‘స్వీట్‌హోం’’ నుంచి ‘‘నీల’’ వరకు...

50ఏళ్ల తెలుగు సాహిత్యంలో సమాజాన్ని ప్రభావితం చేసిన, చర్చల్లో నిలిచిన ప్రముఖ నవలల్లోని నాయికల పాత్రలను సమీక్షించే బాధ్యతను ఆ  పాఠకులు చేపట్టారు. తొమ్మిది మంది తొమ్మిది ప్రముఖ నవలల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాశారు. ఆ పుస్తకాలు, విశ్లేషకుల పేర్లు ఇవి. ‘‘సద్యోగం’’- సరస్వతి నాగరాజ్‌, ‘‘శతాబ్ది సూరీడు’’ - వసుధ, , ‘‘స్వీట్‌హోం’’ - శ్రీలత, ‘‘హిమజ్వాల’’ - సుభాషిణి పోరెడ్డి, ‘‘స్వేచ్ఛ’’ - స్వర్ణకిలారి, ‘‘అవతలిగట్టు’’ - శైలజ కాళ్లకూరి, ‘‘ఎల్లి’’ - నిత్య, ‘‘తన్హాయి’’ - రేవతి అగస్త్య, ‘‘నీల’’ - శ్రుతకీర్తి. ఆ వ్యాసాలను ప్రముఖ రచయిత్రులు వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కె.ఎన్‌ మల్లీశ్వరి ల సంపాదకత్వంలో ‘‘నవలా నాయికలు’’ పుస్తకంగా వెలువడింది. నవల్లోని స్త్రీ పాత్రలను మహిళల స్వరం నుంచి వినడం వినూత్నంగా ఉందన్నారు వ్యాస సంపుటి సంపాదకురాలు కేఎన్‌ మల్లీశ్వరి. తొమ్మిది నవలల్లో ఒక్క హిమజ్వాల మినహా, మిగతావన్నీ రచయిత్రుల కలం నుంచి జాలువారినవే.