చిక్కడపల్లి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు ఎంవీ రామారావు రంగస్థల పురస్కార ప్రదాన కార్యక్రమం ఆదివారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దత్త సాంస్కృతిక సేవా సంస్థ, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ నటి సీహెచ్‌ బృందకు బహూకరించి అభినందించారు. కామరాజుగడ్డ బాబురావు, శ్రీమతి గిరిజ సీతారావమ్మ జీవనసాఫల్య పురస్కారాన్ని ప్రముఖ ఘంటసాల గాయకులు, సామాజికవేత్త(విశాఖపట్నం) వడ్డాది గోపాలకృష్ణమూర్తి, అన్నపూర్ణకు అందజేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆలిండియా రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ వి.ఉదయ్‌ శంకర్‌, భారత్‌ టుడే న్యూస్‌ చానల్‌ డైరెక్టర్‌ వల్లీశ్వర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ప్రఖ్యాత రచయిత శ్రీరమణ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు అమరేంద్ర, శ్రీ దత్త సాంస్కృతిక సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వాసవదత్త రమణ, అధ్యక్షుడు కామరాజుగడ్డ రమణ తదితరులు పాల్గొన్నారు.