చిక్కడపల్లి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): నాకు బాగా నచ్చిన కవి శ్రీశ్రీ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అన్నారు. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సభ నిర్వహించారు. త్యాగరాయ గానసభలో శుక్రవారం రాత్రి జరిగిన సభలో ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారగ్రహీత దేవిప్రియకు, కిన్నెర-శ్రీశ్రీ స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అతిథిగా రమణాచారి మాట్లాడుతూ అక్షరంలోని శక్తిని లోకానికి చూపిన కవి శ్రీశ్రీ అన్నారు. ఆయన రాసిన ఒక మహాప్రస్థానం చాలు ఆయనను మహాకవి అని పిలవడానికి అన్నారు. ఆయన కవిత్వం ఎంతో గొప్పదన్నారు. శ్రీశ్రీ ప్రభావం నాపై చాలా ఉందన్నారు. నేటి సమాజ పరిస్థితులు ఆనాడే చెప్పారన్నారు. శ్రీశ్రీ లాంటి మహానుభావులకు, జయంతులే తప్ప వర్ధంతులు ఉండవని, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దేవిప్రియకు పురస్కారం అనేసరికి సంతోషం అనిపించిందన్నారు.  ప్రముఖ కవి డాక్టర్‌ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యం లేకుండా శ్రీశ్రీ కవిత్వం ఉండదన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ ఓలేటి పార్వతీశం అధ్యక్షతన నిర్వహించిన సభలో కిన్నెర రఘురామ్‌, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

సాహితీజగత్తులో ప్రచండభానుడు శ్రీశ్రీ: వకుళాభరణం

సాహితీ జగత్తులో ప్రచండభానుడు శ్రీశ్రీ అని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. త్యాగరాయగానసభలో శుక్రవారం శ్రీశ్రీ వర్ధంతి సభ జరిగింది. కృష్ణమోహనరావు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణకాంక్ష, సామాజిక న్యాయ దృక్పథంతో విరివిగా కవిత్వం వెలువరించి తెలుగు సాహితీజగత్తును శాసించిన విప్లవ కవి శ్రీశ్రీ అన్నారు.
ప్రజల వాడుక భాషలో అభ్యుదయ, విప్లవ కవిత్వాన్ని వెలువరించి సాహిత్యంలో నూతన అధ్యాయాన్ని సృష్టించిన మహాకవి శ్రీశ్రీ అన్నారు. గ్రాంధిక శైలిని, చందోబద్ద కవిత్వాన్ని ఆయన ధిక్కరించారన్నారు. ఆయన రాసిన మహాప్రస్థానం సమాజాన్ని కుదిపేసిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయనను ప్రజాకవిగా, మహాకవిగా గుర్తించడం ఆయనకు లభించిన అరుదైన గొప్ప గౌరవం అన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రాజేంద్రప్రసాద్‌ శ్రీలక్ష్మి, గీత, ఎస్వీ రామారావు తదితరులు పాల్గొన్నారు.