సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి

గజ్వేల్‌/గజ్వేల్‌ అర్బన్‌: తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి అందించడమే లక్ష్యమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం రాత్రి గజ్వేల్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. మూడు దశాబ్దాల క్రితం అకాడమీల రద్దుతో సాహిత్యం మరుగున పడిందన్నారు. తెలంగాణ యాస, బాషపై జరిగిన దాడి తో, తెలంగాణ సాహిత్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో 1200 సంవత్సరాల క్రితమే సాహిత్యం ఉందని చెప్పారు. సాహిత్య అకాడమీ ద్వారా గ్రామగ్రామాన తిరిగి ఆ గ్రామాలకు సంబంధించిన కళలు, సాహిత్యం సేకరించి చట్టబద్దత కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కాగా సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని, కళలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సాహిత్య అకాడమీని కేసీఆర్‌ ఏర్పాటు చేశారన్నారు. సిధారెడ్డి సారధ్యంలో తెలంగాణ సాహిత్యానికి పూర్వవైభవం రావడం ఖాయమన్నారు.