గార్ల,మహబూబాబాద్‌ జిల్లా(వరంగల్): ప్రముఖ కవి, జాతీయ స్థాయి రంగస్థల దర్శకుడు జానపద లిబర్టీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌ దెంచనాలకు అభినయ జాతీయ పురస్కారం లభించింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ రవీంద్ర భారతి ఆడిటోరియంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ, కేంద్ర సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో అభినయ నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ దర్శకుడు మామిడి హరికృష్ణ చేతుల మీదుగా శ్రీనివాస్‌ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీనివాస్‌ దెంచనాల మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం కిష్టాపురంనకు చెందిన వారు కాగా రంగస్థల కళ ప్రదర్శనలలో అనేక జాతీయ స్థాయి అవార్డులను పొందారు. ప్రఖ్యాత భారతీయ ఆధునిక రంగస్థల దర్శకుడు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత అబీద్‌ తన్జీర్‌, డీవీ ప్రసన్నలతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్‌ దెంచనాల ప్రదర్శించిన బలి, మూగవాని పిల్లన గ్రోవి, మట్టిబండి, ఆదిశక్తి, దొంగసత్తయ్య, మా ఊళ్లో మా రాజ్యం మొదలైన నాటకాలు దేశ విదేశాల్లో ప్రాచుర్యాన్ని పొందాయి. నిర్లక్ష్యిత కులాలు, జాతులు, సమూహాల జీవన ఘర్షణలు, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు వీటిల్లో ప్రతిబింబిస్తాయి.  రవీంద్రభారతిలో జరిగిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు జనపదం అధ్యక్షుడు అంబటి సురేంద్రరాజు, ప్రముఖ కవులు మోహన్‌ రుషి, సదాశ్రీ, ఆదాయపన్ను శాఖ కమిషనర్‌ శ్రీధర్‌, సినీ నటి భార్గవి గాయిత్రి పాల్గొన్నారు.