రవీంద్రభారతి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జానపద పాటలు, శాస్త్రీయ నృత్యాలు, లంబాడీ డాన్సులు, కోయ నృత్యాలు వెరసి నవకళావైభవం కార్యక్రమం సంబరంగా జరిగింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరుణా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నవకళా వైభవం శీర్షికన తెలంగాణ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కళారూపాలతో కళాకారులు అదరగొట్టారు. జానపద నృత్యాలతో పాటు సినీ గీతాలు, డప్పు విన్యాసాలు, కోలాటం తదితర కళా ప్రదర్శనలతో అలరించారు. 

కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో నిష్ణాతులైన చొక్కాపు వెంకటరమణ, సామ్రాజ్యలక్ష్మి, రాజా, సంధ్యాజనక్‌, శ్రీకాంత్‌, మధుమతి, సుబ్బారెడ్డి, వెంకటన్నగౌడ్‌లను విశిష్ట, ఆప్తమిత్ర, కళాసౌరభ పురస్కారాలతో సత్కరించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు పురస్కార గ్రహీతలను, కళాకారులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు తగిన ప్రోత్సాహం అందజేస్తోందని తెలిపారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు డా.వి.అరుణాసుబ్బారావు, అల్లూరి సీతారామరాజు, సుబ్బారావులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ, దర్శకుడు డా.పీసీ.ఆదిత్య, ఉప్పల శ్రీనివా్‌సగుప్తా, సామాజికవేత్త కొత్తకృష్ణవేణి  పాల్గొని పురస్కారగ్రహీతలను అభినందించారు.