రవీంద్రభారతి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాహిత్యం సమాజానికి ప్రేరణగా నిలిచిందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. అకాడమీ ద్వారా తెలంగాణ నవలా సువాసనను వెదజల్లుతామన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నవలా స్రవంతి-1 శీర్షికన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వట్టికోట ఆళ్వారస్వామి రచించిన ప్రజల మనిషి నవలపై ఎన్‌.వేణుగోపాల్‌ ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలం పాటు కావ్యపరిమళం పేరిట కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.  అద్భుతమైన తెలంగాణ నవలలను ప్రజలకు చేరవేసేందుకు నవలా స్రవంతి కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. మొదటి ప్రసంగం వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషితో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.

వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రజల మనిషి నవల తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిందన్నారు. ఈ నవల తెలంగాణలో వచ్చిన ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ప్రజల మనిషి నవల ప్రజలను చైతన్యపరచడంతో పాటు విద్యార్థులకు పాఠంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డితో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.