రవీంద్రభారతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మిమిక్రీ కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. గురువారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేరెళ్ల వేణుమాధవ్‌ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్వీ సత్యనారాయణ నేరెళ్ల వేణుమాధవ్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు వర్సిటీలో మిమిక్రీ, మ్యాజిక్‌ కోర్సులను ఏర్పాటు చేయమని సలహా ఇచ్చిన గొప్ప కళాకారుడు వేణుమాధవ్‌ అని గుర్తుచేశారు. సభాధ్యక్షత వహించిన సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నేరెళ్ల స్ఫూర్తితో ఈతరం యువత ముందుకు సాగాలని సూచించారు. నేరెళ్ల వేణుమాధవ్‌ సతీమణి శోభ మాట్లాడుతూ మిమిక్రీ ఆయనకు ఆరోప్రాణమని అన్నారు. మైమ్‌ మధు, నటుడు ఉత్తేజ్‌, లోహిత్‌ మాట్లాడుతూ నేరెళ్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. కళను, కళాకారుడిని ప్రోత్సహించడంలో ఆయన్ని మించిన వారు ఉండరేమోనని వారన్నారు.  ఈ కార్యక్రమంలో నేరెళ్ల వేణుమాధవ్‌ కుమారులు శ్రీనాథ్‌, రాధాకృష్ణలతో పాటు ప్రదీప్‌, శ్రీనివాస్‌, దైవజ్ఞశర్మ, జనార్దన్‌, ఆంథోనిరాజ్‌ పాల్గొన్నారు.