రవీంద్రభారతి, నవంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): సాహిత్య పరిశోధనలో తనవంతు కృషి చేస్తున్న ఆచార్య వెలుదండ నిత్యానందరావు నిత్యాన్వేషి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్లో ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నందిని సిధారెడ్డి మాట్లాడుతూ నిరంతర అన్వేషణ, కొత్త అంశాలను వెతికి తీయడంలో నిత్యానందరావు దిట్ట అని కొనియాడారు. సభాధ్యక్షత వహించిన డాక్టర్‌ కేవీ రమణాచారి మాట్లాడుతూ నిత్యానందరావు విద్యార్థులను నిరంతరం ఉత్తేజపరిచే నిజమైన ఆచార్యుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మామిడి హరికృష్ణ, ఆచార్య డి.రవీందర్‌, ఆచార్య డి.సూర్యాధనుంజయ్‌, లక్కరాజు రవీందర్‌, శ్రీరంగాచార్య, రాపాక ఏకాంబరాచార్యులు, ఒద్దిరాజు మురళీధరరావు, బాలశ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. తొలి కృతిని లక్కరాజు రవీందర్‌కు అందజేశారు.