రవీంద్రభారతి, హైదరాబాద్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటి లేరని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. గురువారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ లలితకళా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ప్రముఖ నటుడు చలపతిరావు, ప్రవాస రచయిత్రి డా.వాసా ప్రభావతి, ప్రవాసాంధ్రులు సిడ్ని బుజ్జిలకు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ రాజకీయంగా ప్రత్యర్థులమైనప్పటికీ ఎన్టీఆర్‌ సినిమాలను ఇష్టపడేవాడినని అన్నారు. లక్ష్మీపార్వతి నేతృత్వంలో ఎన్టీఆర్‌ పేరిట పురస్కారాలందించడం అభినందనీయమన్నారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన సమాచార హక్కు పూర్వ కమిషనర్‌ పి.విజయబాబు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్‌తో లబ్ధ్దిపొందిన వారు కూడా నేడు ఆయన గురించి మాట్లాడడానికి వెనకాడడం విషాదకరమని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన కారనజన్ముడు ఎన్టీఆర్‌ అని అన్నారు. వేష, భాషలలో ఆయనకు ఆయనే సాటి అని కీర్తించారు.

ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌ అధ్యక్షురాలు డా.ఎన్‌.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో గడిపిన రోజులు గుర్తుచేసుకుంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి తనను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు ఆయనను జ్ఞప్తికి తెచ్చుకోకపోయినా తెలుగు జాతి అంతా ఆయనను స్మరించుకుంటారని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నటి అన్నపూర్ణ పాల్గొన్నారు. సభకు ముందు ఎన్‌న్టీఆర్‌ చలనచిత్ర సంగీత విభావరి నిర్వహించారు. గాయినీగాయకులు సురేఖామూర్తి, శశికళాస్వామి, వెంకటరావు, ఎస్‌.బి.సుధాకర్‌, పి.పవన్‌కుమార్‌ తదితరులు ఎన్టీఆర్‌ చిత్ర గీతాలు ఆలపించి అలరించారు.