చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బాలసాహిత్యాన్ని ఆదరించాలని సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం అన్నారు. బాల సాహిత్య గ్రంథాల ప్రచురణ సంస్థ సరోజారాయ్‌ కమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో 3 బాలసాహిత్య గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమ్యూనికేషన్స్‌, మైండ్‌ అండ్‌ పర్సనాలిటీకేర్‌ హైదరాబాద్‌ శాఖ తమ 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత చొక్కాపు వెంకటరమణ రచించిన బాల వికాస భగవద్గీత, టి. వేదాంతసూరి రచించిన ఫెలుదా సాహసాలు, రంగనాథ రామచంద్రరావు పునర్‌లిఖించిన అలీబాబా 40 దొంగలు గ్రంథాలను ఈ వేదికపై ఆవిష్కరించారు. ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు డా. హిప్నో కమలాకర్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సరోజారాయ్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థ అధినేత్రి డా. హిప్నో పద్మాకమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.