కొత్త ఆలోచనలు, మార్పులకు నాంది పలకండి ..

మాతృభాషను మరిస్తే మానవుడే కాదు

ఉగాది పచ్చడిలో జీవిత పరమార్థం దాగుంది

స్వర్ణభారత్‌ ట్రస్టు ఉగాది వేడుకల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి)/శంషాబాద్‌ రూరల్‌: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయలు ప్రపంచ దేశాలకు ఆదర్శమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం తగ్గిందని, భాషను కాపాడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించానని చెప్పారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశాన్ని మరిచినవాడు మానవుడే కాదన్న విషయాన్ని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పానని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో స్వర్ణభారత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్య మాట్లాడుతూ.. ఈ విళంబినామ సంవత్సరం నుంచి కొత్త ఆలోచనలు, మార్పులకు నాంది పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నేటి యువత తెలుగును పూర్తిగా మరిచిపోతోంది. ఇది మంచి పరిణామం కాదు. మన తెలుగు ఇళ్లల్లో ప్రతి ఒక్కరం తెలుగులోనే మాట్లాడుదాం..’ అని సూచించారు. గవర్నర్‌ నరసింహన్‌ తెలుగులో చక్కగా మాట్లాడతారని ఆయన కొనియాడారు. షడ్రుచుల మేళవింపైన ఉగాది పచ్చడిలో జీవిత పరమార్థం దాగి ఉందన్నారు. దేశాభివృద్ధిలో స్వచ్ఛంద సంస్ధలు భాగస్వామ్యం కావాలని కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పిలుపునిచ్చారు.

దేశ సంపద యువత అని, సరైన సమయంలో యువతకు ఉపాధి కల్పిస్తే దేశం అభివృద్ధి బాట పడుతుందని కేంద్ర సహాయ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పూరి అన్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉండటం తెలుగు రాష్ట్రాల గొప్పతనం అని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ కొనియాడారు. స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు ఈ సందర్భంగా సర్టిఫికెట్లు అందజేశారు.సీఎం కేసీఆర్‌కు ఉప రాష్ట్రపతి అభినందనలురాజ్‌భవన్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యకు తెలుగుకు సంబంధించిన పుస్తకాలను సీఎం అందజేశారు. ఇలాంటి పుస్తకాలను ప్రజలకు అందించాలని సీఎం నిర్ణయించడం సంతోషంగా ఉందని, కేసీఆర్‌ను తాను ప్రత్యేకం గా అభినందిస్తున్నట్లు వెంకయ్య అన్నారు.