ఏప్రిల్‌ 27 నుంచి మే 4 వరకు

ఖమ్మం సాంస్కృతికం, మార్చి 4: పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 27 నుంచి మే 4 వరకు పరుచూరి రఘుబాబు స్మారక అఖిల భారత స్థాయి నాటక పోటీలు-2018 నిర్వహించనున్నట్లు సినీ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుమారుడు పరుచూరి రఘుబాబు జ్ఞాపకార్థం తెలుగు నాటక రంగానికి సేవ చేయాలన్న ఆశయంతో 1991లో పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ స్థాపించి 27 ఏళ్లుగా నాటక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ 28వ నాటక పోటీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పరుచూరి రఘుబాబు జన్మదినం ఏప్రిల్‌ 27న కోటి రూపాయల వ్యయంతో గుంటూరు జిల్లా పల్లెకోన గ్రామంలో నిర్మించిన పరుచూరి రఘుబాబు, టీఎ్‌సఆర్‌ లలిత కళా పరిషత్‌ కళామండపంలో ఈ పోటీలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 30వరకు నాటక పోటీలు జరుగుతాయన్నారు. మే 1నుంచి 4వ తేదీ వరకు ఖమ్మంలో ఖమ్మం కళాపరిషత్‌, ప్రజానాట్యమండలి సంయుక్త నిర్వహణలో నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయన్నారు. మే 4న సినీ గాయకులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి 100 ఎంట్రీలు అందాయన్నారు. ఎంట్రీలు అందిన నాటక, నాటికల ప్రాథమిక పరిశీలన జరుగుతోందన్నారు. ఎంపికైన ప్రతి నాటకానికి రూ.20వేలు, నాటికకు రూ.15వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉత్తమ కళాకారులకు వెండి వస్తువులు ప్రదానం చేస్తామన్నారు. పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించిన సొంత ఆడిటోరియంలో, 80 లక్షల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తో తెలుగు నాటక రంగ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. అఖిల భారత నాటక పోటీలకు అందరూ సహకరించాలని ఖమ్మం కళాపరిషత్‌, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు వీవీ అప్పారావు, డా. నాగబత్తిని రవి, జగన్మోహన్‌రావు, సుబ్రహ్మణ్యకుమార్‌ కోరారు.