చిక్కడపల్లి, మే10(ఆంధ్రజ్యోతి): జనంలోకి చొచ్చుకుపోయేందుకు చక్కటి ప్రక్రియ కవిత్వం అని ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి అమృతలత అన్నారు. టీపీఎస్‌కే, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న అమృతలత మాట్లాడుతూ కవిత్వాన్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా చెప్పాలన్నారు. భావపుష్టితో కవిత్వం రాయాలన్నారు.  తమ రచనల ద్వారా సమస్యలను ఫోకస్‌ చేసి సమాజం ముందు పెట్టేది రచయితలు, కవులేనని అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ గాయని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, కవయిత్రి రమాదేవి కులకర్ణి, హిమబిందు, అనంతోజు మోహనకృష్ణ, సలీమా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.